

బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు కృష్ణా జలాల విషయంలో ఏపీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకున్నారని ఆరోపించారు. ఏపీ 47 టీఎంసీల నీటిని కోరిన నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడినప్పటికీ నీటిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీ, త్రిసభ్య కమిటీ నిర్ణయాలను పట్టించుకోకుండా నీటి తరలింపు ఎలా జరుగుతోందని నిలదీశారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించారని, ఇప్పుడు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి కూడా నీటిని తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే సమయంలో ఇలాంటి చర్యలు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని అన్నారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!