

దేశంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ ఉత్పత్తుల్లో దేశీయంగా తయారైన విడిభాగాల విలువను లెక్కించే విధానాన్ని సవరించింది. విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించి, భారతీయ తయారీ సంస్థలకు ప్రోత్సాహం కల్పించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
ఈ కొత్త విధానం డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, థిన్ క్లయింట్లు, సర్వర్లు, కంప్యూటర్ మానిటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలకు వర్తిస్తుంది. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రిఫరెన్స్ టు మేక్ ఇన్ ఇండియా) ఆర్డర్ 2017 కింద ఈ మార్పులు తీసుకొచ్చారు. కొత్త విధానంలో బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM) ఆధారంగా దేశీయ విలువ జోడింపును లెక్కిస్తారు. భారత్‌లో మదర్‌బోర్డుల అసెంబ్లీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల దేశీయ సేకరణతో పాటు RAM, SSD వంటి మెమరీ, స్టోరేజ్ విడిభాగాల అసెంబ్లీ, పరీక్షలు, ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు.
కేవలం విడిభాగాల తయారీ, అసెంబ్లీ మాత్రమే కాకుండా దేశీయంగా పరిశోధన, అభివృద్ధి (R&D) చేపట్టే కంపెనీలను కూడా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. భారతీయ సంస్థలు సొంతంగా ఉత్పత్తుల డిజైన్లు రూపొందించడం, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, మేధో సంపత్తి హక్కులను (IPR) పొందడంపై దృష్టి సారించింది. దేశీయ విలువ జోడింపును ధృవీకరించేందుకు ప్రత్యేక స్వీయ ధృవీకరణ ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనివల్ల లెక్కింపులో పారదర్శకత పెరగడంతో పాటు అన్ని కంపెనీలకు ఒకే విధమైన ప్రమాణాలు అమలవుతాయి.
ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత అమల్లోకి రానున్నాయి. అమల్లోకి వచ్చిన తర్వాత 2020 సెప్టెంబర్‌లో జారీ చేసిన పాత నిబంధనల స్థానంలో కొత్త విధానం అమలవుతుంది. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతమివ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!