

శక్తిమంతమైన భారతదేశం, ఆదర్శ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలంటే నాణ్యమైన మౌలిక వసతులు, మెరుగైన రహదారి అనుసంధానత అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలో రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించిన గడ్కరీ.. దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ప్రమాద ప్రాంతాలను గుర్తించి భద్రతా ఆడిట్లు నిర్వహించాలని, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతాయని గడ్కరీ తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయం గతంలో 16 శాతంగా ఉండగా, ప్రస్తుతం 9 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం, పర్యావరణహిత రహదారి నిర్మాణ సాంకేతికతను ప్రోత్సహించాలని సూచించారు. వరి గడ్డితో తయారు చేసిన బయోబిటుమిన్‌తో నాగ్‌పుర్-జబల్‌పుర్ జాతీయ రహదారిపై ప్రయోగాత్మకంగా పనులు చేపట్టినట్లు వెల్లడించారు. తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం లక్ష్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన డిజిటల్ హైవే మానిటరింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించారు. మరోవైపు, సదస్సులో ప్రొటోకాల్ పాటించలేదని, ఎంపీలకు తగిన గౌరవం ఇవ్వలేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!