

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ముందడుగు వేసింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి నోటిఫికేషన్ నెం. 401/SEC-F1/2026-1ను ఆగస్టు 12, 2026న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాలను 2026 సెప్టెంబర్ 3న ప్రచురించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటు మేయర్లు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఈ జాబితాలు ప్రభుత్వానికి ఉపయోగపడనున్నాయి.

2026 జనవరి 1ను అర్హత తేదీగా పరిగణించి, ఆ తేదీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రచురించి, సవరించిన తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీ ఓటర్ల జాబితాలను రూపొందించనున్నారు. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో సంబంధిత జోనల్ కమిషనర్లు తమ తమ జోన్లకు సంబంధించిన జాబితాలను రూపొందించి ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి విధివిధానాలను జారీ చేయనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!