

తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఖమ్మం–వరంగల్–నల్గొండ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ నియోజకవర్గాలకు ఒక్కో సీటుకు ముగ్గురి చొప్పున పేర్లతో పీసీసీ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సామాజిక సమీకరణాలు, పార్టీకి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
అభ్యర్థుల తుది ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానం చేపట్టనుంది. ఖమ్మం–వరంగల్–నల్గొండ స్థానానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సెప్టెంబర్ 28న ప్రారంభం కానుంది. ఫారం-18 దరఖాస్తులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉండగా, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!