

నాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జనగణనలో బీసీల గణన కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు గణనీయమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అదే ఐక్యతను సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించి రాజకీయంగా అధికారంలో భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ దాసరిరాజు అజయ్‌కుమార్, కో-ఛైర్మన్ బంగారు బాబు, వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ రేణుక, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!