

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లోనే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన కాంగ్రెస్ నేత సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను మూడుసార్లు నిలిపివేసిందని ఆరోపించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించినప్పటికీ అక్కడి నాయకుడు ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. ఇనుగుర్తిలో ప్రారంభమైన చేరికల పరంపర మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని అన్నారు. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. తెలంగాణభవన్‌లో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేస్తూ, పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!