

జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది మసూద్ అజర్‌పై పాకిస్థాన్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ రూ.70 లక్షల పాకిస్థానీ రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. మసూద్ అజర్ పేరును అత్యంత వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో కొనసాగిస్తూ.. అతడి అరెస్టు లేదా నేర నిర్ధారణకు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి ఈ నగదు బహుమతి అందజేస్తామని తెలిపింది. మసూద్ అజర్ పాకిస్థాన్‌లో లేడని, అతడు అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయాడని ఇస్లామాబాద్ గతంలో పలుమార్లు పేర్కొంది. అక్టోబర్ 26 నుంచి 30 వరకు పారిస్‌లో జరగనున్న ఆర్థిక చర్యల కార్యాచరణ దళం (ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశానికి ముందు పాకిస్థాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మసూద్ అజర్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి తదితర ఘటనల్లో జైషే మొహమ్మద్ ప్రమేయం ఉన్నట్లు భారత అధికారులు పేర్కొన్నారు. మసూద్ అజర్‌పై పాకిస్థాన్ తాజాగా ప్రకటించిన నగదు బహుమతిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించింది. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయని పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్.. ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠినమైన, వాస్తవిక చర్యలు తీసుకోవాలని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!