

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై జారీ చేసిన లుక్‌ఔట్ సర్క్యులర్‌ను ఎత్తివేస్తే లండన్‌కు వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తన భర్త మధుకర్ భారత్‌కు వచ్చిన వెంటనే ఆయనను విచారించాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 8న పోలీసులు ఆమెను విచారించినప్పటికీ సహకరించలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. న్యాయవాదుల సూచన మేరకు రిక్వెస్ట్ లెటర్ పంపిన రమానందన.. నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే మంగళవారం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజులు ఆమెను విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!