

కోనసీమను అతలాకుతలం చేసిన 1996 నాటి భీకర తుపానుకు నవంబర్ 6తో మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రకృతి సృష్టించిన ఆ విలయం ఇప్పటికీ అక్కడి ప్రజల మనసుల్లో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది. 1996 నవంబర్ 6న సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 215 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులు కోనసీమతో పాటు తాళ్లరేవు, యానాం ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. లక్షలాది కొబ్బరిచెట్లు నేలకూలడంతో పాటు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 1996 అక్టోబర్ చివరి వారంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్, నికోబార్ దీవుల మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి క్రమంగా బలపడింది. నవంబర్ 6న కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది.
ఈ తుపాను ధాటికి ఐ.పోలవరం మండలంలోని భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సముద్రంలో చిక్కుకున్న పలువురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1,077 మంది మృత్యువాత పడగా.. 2.33 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 40 వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. 78 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో పాటు 241.80 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తరతరాలుగా ఆదాయాన్ని అందించే కొబ్బరితోటలు భారీగా ధ్వంసమయ్యాయి. లక్షలాది చెట్లు నేలకూలగా, మరికొన్ని మొవ్వులు విరిగి పనికిరాకుండా పోయాయి. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి రైతులకు పదేళ్లకు పైగా సమయం పట్టింది. తాజాగా అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో 73,500 కొబ్బరిచెట్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. దెబ్బతిన్న ప్రతి చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు రైతులకు సుమారు రూ.11 కోట్ల పరిహారం అందాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!