

విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో కొత్త రైల్వే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయవాడ జంక్షన్-కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్ల మధ్య, విజయవాడ-సీతానగరం ప్రాంతంలో ఈ వంతెన నిర్మించనున్నారు. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో విజయవాడ నుంచి గూడూరు వరకు 293 కి.మీ. మేర నాలుగో లైన్ నిర్మాణానికి రూ.5,858 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి రైల్వే బోర్డుకు పంపించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై సుమారు 1.30 కి.మీ. పొడవున మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం విజయవాడ-సీతానగరం మధ్య కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకదానిపై డబుల్ లైన్, మరోదానిపై సింగిల్ లైన్ కొనసాగుతున్నాయి. వీటికి సమీపంలోనే మూడో వంతెన నిర్మించనున్నారు.
కొత్త వంతెన అందుబాటులోకి వస్తే తెనాలి, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్ స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా తమిళనాడు వైపు వెళ్లే గూడ్స్ రైళ్ల రాకపోకలు కూడా వేగవంతమవుతాయి. ఇదిలా ఉండగా, కృష్ణా నదిపై మరో రెండు రైల్వే వంతెనల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త రైల్వే లైన్‌లో భాగంగా అమరావతి సమీపంలో ఒక వంతెన నిర్మించనున్నారు. ఇందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. మరోవైపు విజయవాడ బైపాస్ రైల్వే లైన్‌లో భాగంగా గుడివాడ-విజయవాడ మార్గంలోని ఇందుపల్లి నుంచి విజయవాడ-తెనాలి మార్గంలోని దుగ్గిరాల వరకు 36.8 కి.మీ. మేర కొత్త డబుల్ లైన్ నిర్మించనున్నారు. దీనివల్ల విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే గూడ్స్ రైళ్లు విజయవాడ స్టేషన్‌లోకి ప్రవేశించకుండానే ప్రయాణించవచ్చు. ఈ బైపాస్ లైన్, చోడవరం సమీపంలోని కృష్ణా నది వంతెన నిర్మాణానికి కలిపి రూ.3,197 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు పంపించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!