

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ముందస్తు అంచనాలను మించి ఉండే అవకాశముందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మొదటగా రూ. 9,500 నుంచి రూ. 10,500 కోట్ల వరకు నష్టాలు ఉంటాయని భావించిన పరిశ్రమ అంచనాలను సవరించిన ఇక్రా, ఇవి రూ. 17,000–18,000 కోట్ల స్థాయికి చేరవచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది.
విమాన ప్రయాణికుల రద్దీ తగ్గడం, ఆపరేషనల్ అంతరాయాలు, ప్రయాణాలపై ప్రతికూల సెంటిమెంట్ వంటి అంశాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలిపింది. దేశీ విమానయాన ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి గతంలో అంచనా వేసిన 4–6 శాతం స్థాయి నుంచి 0–3 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 విమాన దుర్ఘటన, ఇండిగో సంస్థ వేల సంఖ్యలో ఫ్లైట్లను రద్దు చేయడం వల్ల విమాన ప్రయాణాలపై నమ్మకం దెబ్బతిందని నివేదిక పేర్కొంది. సరిహద్దు ఉద్రిక్తతలు, సేవల రద్దులు, అంతరాయాల కారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ప్రయాణికుల రద్దీ ఊహించిన స్థాయిలో నమోదు కాలేదని తెలిపింది.
డిసెంబర్ 3 నుంచి 8 మధ్య ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాల కారణంగా సుమారు 4,500 విమానాలు రద్దయ్యాయి. ఇవి పరిశ్రమ మొత్తం వార్షిక డిపార్చర్లలో 0.4 శాతమే అయినప్పటికీ, ప్రయాణికుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు ఇక్రా వివరించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన సంస్థల ద్వారా అంతర్జాతీయంగా ప్రయాణించే ప్రయాణికుల వృద్ధి 7–9 శాతానికి పరిమితం కావచ్చని, గత అంచనాలైన 13–15 శాతం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. అలాగే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల వృద్ధి మందగించడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత కారణంగా విదేశీ మారక నష్టాలు పెరగడం వల్ల పరిశ్రమపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగనుంది.
అంచనాల ప్రకారం 2025 నవంబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.54 కోట్లకు చేరవచ్చు. ఇది 2024 నవంబర్‌లోని 1.42 కోట్లతో పోలిస్తే 8.4 శాతం అధికం కాగా, 2025 అక్టోబర్‌లో నమోదైన 1.40 కోట్లతో పోలిస్తే 10.1 శాతం ఎక్కువ. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య వార్షికంగా 2.2 శాతం పెరిగి 10.96 కోట్లకు చేరింది. అదే విధంగా 2025 అక్టోబర్‌లో దేశీ ఎయిర్‌లైన్స్ ద్వారా అంతర్జాతీయంగా ప్రయాణించిన వారి సంఖ్య 8.3 శాతం వృద్ధితో 29.9 లక్షలకు చేరింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!