

ప్రపంచ విద్యుత్ వాహనాల దిగ్గజ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో కొత్త అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్డులోని వీఆర్ బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా వినియోగదారులు టెస్లా వాహనాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం పొందనున్నారు.
ఇప్పటికే ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లాకు ఇది దేశంలో నాలుగో అనుభవ కేంద్రం. ఈ కేంద్రంలో టెస్లా మోడల్ వై, కొత్తగా విడుదలైన మోడల్ వైఎల్ ఎస్యూవీ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు అమ్మకాల అనంతర సేవలను కూడా అందించనున్నారు.
కొత్త మోడల్ వైఎల్ ఎస్‌యూవీలో 83 కిలోవాట్ అవర్ బ్యాటరీని అమర్చారు. ఇది 250 కిలోవాట్ వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 288 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి ఛార్జ్‌తో 681 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం ఉండగా, ఐదు సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!