

అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ టీ-మొబైల్ అనుబంధ సంస్థ టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో తన కొత్త గ్లోబల్ సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పెట్టుబడితో హైదరాబాద్ ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రాల గమ్యస్థానంగా మరింత బలపడింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు సాయికృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రగుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో సాంకేతిక రంగ అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
ఈ కేంద్రం సాఫ్ట్వేర్ రూపకల్పన, ఉత్పత్తుల అభివృద్ధి, సమాచార విశ్లేషణ, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు, డిజిటల్ రూపాంతర సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. 2027 నాటికి ఉద్యోగుల సంఖ్యను దాదాపు 1,000 మందికి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం టీ-మొబైల్ 14 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే 450కు పైగా ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రాలు ఉండగా, వాటిలో 3 లక్షలకుపైగా నిపుణులు పనిచేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!