

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా 8 యూరోపియన్ దేశాలపై సుంకాలు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఒక దశలో 672.04 పాయింట్లు పడిపోయి 82,898.31కు చేరుకున్నప్పటికీ, చివరికి 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 108.85 పాయింట్లు తగ్గి 25,585.50 వద్ద స్థిరపడింది.
ట్రంప్ తాజా హెచ్చరికలు, అలాగే కొన్ని కంపెనీల నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్ వంటి దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. మొత్తం మార్కెట్ బలహీనత కారణంగా బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.28 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.43 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.04 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.26 శాతం క్షీణించాయి.
ఇదిలా ఉండగా, కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) షేర్ల లిస్టింగ్ మాత్రం మార్కెట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.23 ఇష్యూ ధరతో వచ్చిన ఈ షేరు బీఎస్ఈలో 96.56 శాతం ప్రీమియంతో రూ.45.21 వద్ద లిస్టై, చివరికి రూ.40.66 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కూడా 95.65 శాతం ప్రీమియంతో రూ.45 వద్ద ప్రారంభమైన ఈ షేరు, ముగింపు సమయంలో రూ.40.58కు చేరింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.18,935.36 కోట్లుగా నమోదైంది.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!