

దేశీయ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా చర్యలు నిలిపివేయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడడంతో సూచీలు బలంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 1079 పాయింట్ల లాభంతో 73,775 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 337.4 పాయింట్లు పెరిగి 22,848.80 వద్ద కొనసాగుతోంది. అయితే రూపాయి విలువ మాత్రం ఒత్తిడిలో కొనసాగుతూ, మరో 18 పైసలు తగ్గి 93.71 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సూచీలో ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు మంచి లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాల షేర్లు 1 నుంచి 2 శాతం వరకు లాభాలను నమోదు చేస్తున్నాయి.
అంతేకాకుండా ఆసియా–పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ సూచీ 1.1 శాతం, దక్షిణ కొరియా కోస్పి 3 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.32 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.6 శాతం మేర లాభాల్లో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 13 శాతం తగ్గి 99 డాలర్ల వద్ద స్థిరపడినట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!