

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఫ్యూచర్ మార్కెట్లో భారీగా పతనం చోటుచేసుకుంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్ కిలో వెండి ధర గంటలోనే సుమారు రూ.21 వేల మేర తగ్గింది. సోమవారం ఇంట్రాడేలో రూ.2,54,174 వద్ద గరిష్ఠాన్ని తాకిన వెండి, రూ.2,33,120 వరకు పడిపోయింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కూడా కిలో వెండి ధర రూ.2.50 లక్షల స్థాయి నుంచి రూ.2.39 లక్షలకు తగ్గింది.
ఇటీవల భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా బంగారం, వెండికి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెండి అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా భారీగా ఎగసి 80 డాలర్ల స్థాయిని దాటింది. అయితే గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి ధరలు క్రమంగా పడిపోయాయి.
ఈ పతనానికి ప్రధాన కారణంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు వెలువడటం విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగిసే అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అలాగే, ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధర 181 శాతం పెరగడంతో మదుపర్లు లాభాలు తీసుకోవడమూ పతనానికి కారణమైంది. అదేవిధంగా చికాగో మర్చంట్ ఎక్స్ఛేంజీ 2026 మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మార్జిన్‌ను పెంచడం కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో అధిక రిస్క్ తీసుకునే ట్రేడర్లు వెనక్కి తగ్గడంతో వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!