

సెక్యూరిటీ లావాదేవీల పన్నుపై (STT) ఉన్న ఆందోళనలు తగ్గడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 943.52 పాయింట్లు లాభపడి 81,666.46 వద్ద ముగియగా, నిఫ్టీ 262.95 పాయింట్లు పెరిగి 25,088.40 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1,345 పాయింట్లు పుంజుకుంది. కేంద్ర బడ్జెట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండడం, కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందన్న వార్తలు, అలాగే ముడి చమురు ధరలు భారీగా తగ్గడం మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు బ్లూచిప్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లను భారీగా కొనుగోలు చేశారు.
బ్రోకరేజ్ షేర్లకు పునరుజ్జీవం
ఆదివారం భారీగా పడిపోయిన స్టాక్ బ్రోకరేజ్ కంపెనీల షేర్లు సోమవారం గట్టిగా కోలుకున్నాయి. ఏంజెల్ వన్ షేరు బీఎస్ఈలో 4 శాతం లాభంతో రూ.2,405.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలతో పాటు ఈ షేర్లు కూడా నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, మార్కెట్ పుంజుకోవడంతో త్వరలోనే లాభాల బాట పట్టాయి.
ఇదిలా ఉండగా, దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత నెలలో ఎఫ్‌పీఐలు రూ.35,962 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, గత ఏడాది మొత్తంగా చూస్తే రూ.1.66 లక్షల కోట్ల మేర నిధులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పీఎఫ్సీ–ఆర్ఈసీ విలీనం దిశగా అడుగులు
విద్యుత్ రంగానికి రుణాలు అందించే ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) మరియు దాని అనుబంధ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) విలీనం కానున్నాయి. ఈ రెండు సంస్థలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్లో ప్రకటించారు. ఈ ప్రక్రియలో భాగంగా, RECను PFCలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!