

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (MSI) 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో నమోదైన రూ.3,911.1 కోట్ల లాభంతో పోల్చితే ఇది 6.45 శాతం తగ్గుదలగా నిలిచింది. రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు నమోదైనప్పటికీ మార్క్-టు-మార్కెట్ ప్రభావం, నిర్వహణేతర ఆదాయం తగ్గడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో మొత్తం రాబడి 28.2 శాతం పెరిగి రూ.52,462.5 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో తొలిసారిగా నికర అమ్మకాలు రూ.50,000 కోట్ల మైలురాయిని దాటినట్లు సంస్థ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.37,585.5 కోట్ల నుంచి రూ.48,125.3 కోట్లకు పెరిగాయి. అలాగే కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక అమ్మకాలుగా 6,76,209 యూనిట్లు నమోదయ్యాయి. డైరెక్టర్ల బోర్డు 2025-26 సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.140 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.
మార్చితో ముగిసిన మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి మారుతి సుజుకీ కన్సాలిడేటెడ్ నికర లాభం 1.24 శాతం పెరిగి రూ.14,679.5 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రూ.14,500.2 కోట్ల లాభం నమోదు కాగా, ఈసారి మొత్తం ఆదాయం రూ.1,83,316 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం వాహనాల అమ్మకాలు 22,34,266 యూనిట్ల నుంచి 24,22,713 యూనిట్లకు పెరిగాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 19,74,939 యూనిట్లు ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు ప్రభావంతో దేశీయ మార్కెట్లో ద్వితీయార్థంలో అమ్మకాలు మెరుగుపడ్డాయని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.14,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కేంద్రాలు వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. హరియాణాలోని ఖర్ఖోడా, గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్రాంతాల్లో సంవత్సరానికి 5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రెండు కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి ముఖ్యంగా చిన్న కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!