

గ్రీన్లాండ్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మెట్టు దిగివచ్చినట్టుగా సంకేతాలు ఇవ్వడం, అలాగే భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కానుందన్న అంచనాలు బలపడడంతో గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికిన సెన్సెక్స్ 397.74 పాయింట్ల లాభంతో 82,307.37 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 132.40 పాయింట్లు పెరిగి 25,289.90 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ గరిష్ఠంగా 873.55 పాయింట్లు, నిఫ్టీ 278.25 పాయింట్లు లాభపడినప్పటికీ ఆ స్థాయిల్లో నిలబడలేకపోయాయి. అయితే దిగువ స్థాయిల్లో కొనుగోళ్లకు మంచి మద్దతు లభించిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య అవగాహన కుదరడం వల్ల గ్లోబల్ స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధంలో ఈ ఐపీఓను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఫోన్‌పేలో వాల్‌మార్ట్ తన వాటాలో 12 శాతం విక్రయించనుంది. అలాగే చిన్న వాటాదారులైన మైక్రోసాఫ్ట్, టైగర్ గ్లోబల్ కూడా తమ వాటాలను విక్రయించనున్నాయి.
ఫోన్‌పే సెబీకి తాజాగా సమర్పించిన సవరించిన డ్రాఫ్ట్ దరఖాస్తు ప్రకారం, ఈ ఐపీఓలో మొత్తం 5.07 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో విక్రయించనున్నారు. ఇందులో కొత్తగా షేర్ల జారీ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. సంస్థ విలువను సుమారు 1,500 కోట్ల డాలర్లుగా (రూ.1.44 లక్షల కోట్లు) అంచనా వేసి, ఈ ఇష్యూ ద్వారా దాదాపు 150 కోట్ల డాలర్లు (రూ.14,400 కోట్లు) సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత అక్టోబరులో టాటా క్యాపిటల్ విడుదల చేసిన 170 కోట్ల డాలర్ల ఇష్యూ తర్వాత, ఇదే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కానుంది. ప్రస్తుతం ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కు 71.77 శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా వాల్‌మార్ట్ సుమారు 9 శాతానికి సమానమైన 4.59 కోట్ల షేర్లను విక్రయించనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!