

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కొత్త కనిష్ఠాలకు పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ప్రస్తుత ఖాతా లోటు మరింత పెరగకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
దిగుమతి సుంకాల పెంపుతో బంగారం, వెండి కొనుగోళ్లపై డిమాండ్ తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రముఖ ఆభరణాల సంస్థల వాటాలు నేడు భారీగా పడిపోయాయి. ఎన్ఎస్సీ సూచీలో టైటన్ సంస్థ వాటా 1.43 శాతం తగ్గగా, కల్యాణ్ జ్యువెలర్స్ వాటా 5.40 శాతం క్షీణించింది. అలాగే సెన్కో గోల్డ్ వాటా 0.56 శాతం, తంగమాయిళ్ జ్యువెలర్స్ వాటా 5 శాతం మేర పడిపోయాయి. రాబోయే రోజుల్లో కూడా ఆభరణాల రంగంపై ఒత్తిడి కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అదే సమయంలో సౌర విద్యుత్ పరికరాల సంస్థలు, విద్యుత్ నిర్వహణ సేవల రంగాలపై కూడా మోస్తరు ప్రతికూల ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బంగారం రుణాలు అందించే సంస్థలకు ఈ పరిణామం అనుకూలంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దిగుమతి సుంకాల పెంపుతో విదేశీ నిధుల ప్రవాహం నియంత్రణలోకి వచ్చి, రూపాయి విలువ కొంత మేర కోలుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!