

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ రంగంలోకి ప్రవేశిస్తూ పునరుత్పాదక ఇంధన సంస్థ యాక్సిస్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2032 నాటికి 20 గిగావాట్ అవర్ల సామర్థ్యమున్న బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలు (బీఈఎస్‌ఎస్) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్య, పారిశ్రామిక మరియు గ్రిడ్ అవసరాల కోసం ‘ఓలా మహాశక్తి’ పేరుతో బీఈఎస్‌ఎస్ సేవలను ఈ నెల 15న ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రిడ్ స్థాయి నిల్వ విభాగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.
యాక్సిస్ ఎనర్జీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇంధన నిల్వతో కూడిన పునరుత్పాదక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. గ్రిడ్ ద్వారా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు బ్యాటరీ నిల్వ వ్యవస్థలు కీలకమని యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ చైర్మన్, ఎండీ రవి కుమార్ రెడ్డి కటారు తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్, ఎండీ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ బ్యాటరీ తయారీ, సిస్టమ్ ఇంజినీరింగ్‌ను పూర్తిగా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!