

దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి ప్రారంభమైంది. టెలికం దిగ్గజం జియోతో పాటు దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ భారీ పబ్లిక్ ఆఫర్లకు సిద్ధమవుతున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ దాదాపు రూ.37,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ముందుకు వస్తుండగా, ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓకు రంగం సిద్ధం చేసింది. జియో 27 కోట్ల తాజా షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరించనుంది. జియో మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లకు, ఎన్ఎస్ఈ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా.
జెప్టో, ఫోన్‌పే వంటి సంస్థలు కూడా బిలియన్ డాలర్లకు పైగా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు ప్రధాన ఇష్యూల ద్వారానే మార్కెట్ల నుంచి దాదాపు రూ.1 లక్ష కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. గత ఏడాది 104 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.76 లక్షల కోట్లకు పైగా సమీకరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 23 కంపెనీలు మాత్రమే సుమారు రూ.27,000 కోట్లను సమీకరించాయి. ప్రస్తుతం 163 కంపెనీలకు సెబీ అనుమతి లభించగా, మరో 73 సంస్థలు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.
అయితే గతంలో భారీ ఐపీఓలు ఇన్వెస్టర్లను నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. రూ.27,859 కోట్ల హ్యుందాయ్ ఇండియా ఐపీఓ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఎల్ఐసీ, పేటీఎం షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. పేటీఎం షేరు ఇప్పటికీ 50 శాతం నష్టాల్లో ఉండగా, ఎల్ఐసీ షేరు ఇష్యూ ధర కంటే 7 శాతం దిగువన కొనసాగుతోంది. అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కంటే దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!