

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఇరాన్ శాంతి ప్రతిపాదనలను తిరస్కరించడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని నరేంద్రమోదీ ఇంధన వినియోగం తగ్గించాలని, బంగారం కొనుగోళ్లను తగ్గించాలని చేసిన పిలుపు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1,312.91 పాయింట్లు కోల్పోయి 76,015.28 వద్ద ముగియగా, నిఫ్టీ 360.30 పాయింట్లు పడిపోయి 23,815.85 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.6 లక్షల కోట్లు తగ్గి రూ.467 లక్షల కోట్లకు చేరింది. టైటాన్, ఇండిగో, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్ స్టాక్స్ భారీ నష్టాలు చవిచూడగా, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరడం, రూపాయి విలువ 95.34 స్థాయికి పడిపోవడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!