

దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్లీనంగా సానుకూల ధోరణి కొనసాగుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలమైన జూన్ త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరల తగ్గుదల, స్థిరంగా ఉన్న రూపాయి మారక విలువ, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచే అవకాశముంది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంకేతాలను మదుపర్లు నిశితంగా గమనించాల్సి ఉంటుంది. డెరివేటివ్ ట్రేడింగ్‌లోని షేర్లకు కొత్తగా అమల్లోకి వచ్చిన వేలం ఆధారిత ధర గుర్తింపు విధానం (CAS) కూడా మార్కెట్‌పై ప్రభావం చూపే అంశంగా మారనుంది. నిఫ్టీ-50కి 24,750-24,780 స్థాయిని కీలక నిరోధంగా సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. 24,780 పైన నిలదొక్కుకుంటే 24,900, ఆ తర్వాత 25,050 స్థాయిలను చేరే అవకాశం ఉందని అంచనా. దిగువన 24,500-24,480 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.
రంగాల వారీగా చూస్తే ఆటో సూచీ లాభాల బాటలో కొనసాగవచ్చని, 28,600-28,900 వద్ద మద్దతు, 30,600-31,000 వద్ద నిరోధం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ మెటల్ సూచీలో మరింత పెరుగుదలకు అవకాశం ఉండగా, లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ ఫలితాలు కీలకం కానున్నాయి. టెలికాం షేర్లు స్థిరంగా ఉండొచ్చని, వొడాఫోన్ ఐడియా ఫలితాలు, పునరుజ్జీవ ప్రణాళికపై యాజమాన్య వ్యాఖ్యలు ప్రభావం చూపవచ్చని అంచనా. బలహీన ఫలితాలతో కొన్ని ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నా, మెరుగైన ఫలితాలు ఇచ్చిన కంపెనీలు నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. నిఫ్టీ బ్యాంక్, ఫార్మా సూచీలకు సానుకూల అవకాశాలు ఉండగా, ఐటీ షేర్లు అంతర్జాతీయ ఏఐ పరిణామాల ప్రభావంతో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. సిమెంట్, చమురు-గ్యాస్, యంత్రపరికరాల షేర్లలోనూ పరిమిత శ్రేణిలో ట్రేడింగ్ కొనసాగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వారం వర్షపాతం, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా నిలవనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!