

భారత్ నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, పరికరాల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఈ ఎగుమతుల విలువ రూ.4 లక్షల కోట్లను దాటినట్లు కేంద్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో ఐఫోన్ల ఎగుమతుల విలువ మాత్రమే రూ.2.03 లక్షల కోట్ల వరకు ఉండడం విశేషం. ఇది 2024తో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయికి చేరినట్లు వెల్లడించారు.
2024లో దేశంలో మొత్తం రూ.11.3 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారయ్యాయి. అందులో రూ.3.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతయ్యాయి. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 25 లక్షలను మించిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతులు మరింత పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి విలువ కనీసం 7,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.76 లక్షల కోట్లు), ఎగుమతులు 3,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.7 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) పేర్కొంది. ఈ ఏడాది దేశంలో నాలుగు సెమీకండక్టర్ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్ల ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!