

అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల కోతలు మరింత వేగం అందుకుంటున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ స్టాండర్డ్ చార్టర్డ్ 2030 నాటికి దాదాపు 7,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, చైనాలోని షెంజెన్, పోలాండ్ రాజధాని వార్సాలో పనిచేస్తున్న బ్యాక్ ఆఫీస్ సిబ్బందిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని సమాచారం.
సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 15 శాతం మందిపై ఈ కోతల ప్రభావం ఉండొచ్చని సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి బిల్ వింటర్స్ తెలిపారు. తక్కువ ఖర్చుతో వేగంగా పనులు నిర్వహించేందుకు ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పునఃశిక్షణ తీసుకుని కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా మరోసారి భారీ ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశముందని తెలుస్తోంది. ఉద్యోగులకు ఈ సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా తెలియజేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందుకే బుధవారం ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!