

ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిలో ఉందని భావించి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయకుండా ఉండకూడదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. 2026–27 అసెస్‌మెంట్ ఇయర్‌కు కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.4 లక్షల వరకు, పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు ఉన్నవారికి సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా ఐటీఆర్ దాఖలు చేయడం చట్టప్రకారం తప్పనిసరి అని శాఖ స్పష్టం చేసింది.
విదేశాల్లో ఆస్తులు లేదా పెట్టుబడులు కలిగి ఉండటం, విదేశీ బ్యాంకు ఖాతాలపై సంతకం చేసే అధికారం ఉండటం, కరెంట్ ఖాతాల్లో ఏడాదిలో రూ.1 కోటికి పైగా నగదు జమ చేయడం, సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలకు మించి డిపాజిట్లు చేయడం, విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేయడం, రూ.1 లక్షకు మించిన విద్యుత్ బిల్లులు చెల్లించడం, వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలకు మించి ఉండటం లేదా వృత్తిపరమైన స్థూల రసీదులు రూ.10 లక్షలకు మించి ఉండటం, అలాగే టిడిఎస్ లేదా టిసిఎస్ నిర్దేశిత పరిమితిని మించడం వంటి పరిస్థితుల్లో ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు, జరిమానాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను జూలై 31, 2026లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!