

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పలు చర్యలను పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల బరువును తగ్గించే ప్రతిపాదనను పరిశ్రమ వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల సిలిండర్లను అందించే ప్రణాళికలపై ఆలోచనలు జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం వినియోగదారులకు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. అయితే సరఫరా లోటు రాకుండా ఉండేందుకు అదే సిలిండర్లలో 10 కిలోల ఎల్పీజీని నింపి పంపిణీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో రోజుకు సుమారు 93,500 టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతుండగా, ఇందులో గృహ వినియోగమే ఎక్కువగా ఉంది. ఎల్పీజీ సరఫరా కోసం భారత్ అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.
సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ఒక కుటుంబానికి 35-40 రోజులు సరిపోతుంది. అదే 10 కిలోల సిలిండర్ అయితే సుమారు నెల రోజులు ఉపయోగించవచ్చని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో అందరికీ సరఫరా అందేలా ఈ మార్పులను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే సిలిండర్ బరువులో మార్పు చేస్తే, దానికి సంబంధించిన వివరాలను లేబుల్ రూపంలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా ధరను కూడా తగిన విధంగా సవరించాల్సి ఉంటుంది. దీనికి తోడు రీఫిల్లింగ్ వ్యవస్థల్లో మార్పులు చేయడం, అవసరమైన నియంత్రణ అనుమతులు పొందడం వంటి ప్రక్రియలు కూడా అవసరమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు చమురు సంస్థలు లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!