

గురుగ్రామ్‌లో విలాసవంతమైన ఓ పెంట్‌హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ విక్రయించిన ఈ ప్రాపర్టీని పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెంట్‌హౌస్ 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షల చొప్పున ఈ విక్రయం జరిగినట్లు సమాచారం.
ఈ పెంట్‌హౌస్ డీఎల్‌ఎఫ్ ఫేజ్-5లోని ‘ది డాలియాస్’ విలాసవంతమైన గృహ ప్రాజెక్టులో భాగం. గురుగ్రామ్‌లో 17 ఎకరాల్లో 2024 అక్టోబరులో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో మొత్తం 420 అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 65 శాతానికి పైగా నివాసాలను కంపెనీ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ల ధరలు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకు ఉన్నాయి. కొవిడ్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో అల్ట్రా-లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో గురుగ్రామ్, ముంబయి వంటి నగరాల్లో భారీ విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!