

టాటా గ్రూప్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో టాటా ట్రస్ట్ బోర్డులో సభ్యుల పునర్నియామకాలపై విభేదాలు వ్యక్తమవగా, తాజాగా టాటా సన్స్ బోర్డులో కూడా అభిప్రాయ భేదాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. టాటా సన్స్‌కు మూడోసారి చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్‌ను పునర్నియమించే అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బోర్డు వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో చంద్రశేఖరన్ పదవీకాలం 2027 ఫిబ్రవరిలో ముగియనుంది. ఆ తర్వాత కూడా ఆయనను చైర్మన్‌గా కొనసాగించాలా అనే అంశంపై మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయం తీసుకోకుండా సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, టాటా ట్రస్ట్‌ల చైర్మన్ నోయల్ టాటా అభిప్రాయ భేదాలే దీనికి కారణమని సమాచారం. టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్‌లకు నోయల్ టాటా నాయకత్వం వహిస్తున్నారు. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే, బోర్డులోని మరికొంతమంది సభ్యులు చంద్రశేఖరన్ పునర్నియామకానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. నష్టాలు నమోదు చేస్తున్నవి ప్రధానంగా కొత్త తరం సంస్థలేనని, వాటి వ్యాపారాలు లాభదాయక దశకు చేరుకోవడానికి కొంత సమయం అవసరమని వారు అభిప్రాయపడ్డారని వర్గాలు పేర్కొన్నాయి. ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుందామని కొందరు సూచించినప్పటికీ, చంద్రశేఖరన్ స్వయంగా ఈ అంశాన్ని వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో నోయల్ టాటాతో పాటు టీవీఎస్ గ్రూప్‌కు చెందిన వేణు శ్రీనివాసన్ టాటా ట్రస్ట్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రశేఖరన్ పునర్నియామకానికి అంగీకారం తెలపాలంటే నోయల్ టాటా నాలుగు షరతులను బోర్డు ముందుంచినట్లు సమాచారం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!