

డిజిటల్ చెల్లింపుల కాలంలో క్రెడిట్ కార్డులు అనివార్యంగా మారాయి. అయితే సౌలభ్యంతో పాటు మోసాల ప్రమాదం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇటీవల నమోదవుతున్న ఘటనలు చూస్తే, చిన్న నిర్లక్ష్యం వల్లే కార్డ్ వివరాలు చోరీకి గురై ఖాతాలు ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది.
పెట్రోల్ పంపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఏటీఎంలు వంటి ప్రదేశాలు మోసాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. మీ కార్డు కొద్దిసేపైనా కంటికి కనిపించకుండా పోతే, వివరాలు కాపీ అయ్యే అవకాశం ఉంది. అలాగే తెలియని వెబ్సైట్లు, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, థర్డ్ పార్టీ యాప్‌లలో కార్డ్ వివరాలు నమోదు చేయడం ప్రమాదకరం.
ఉచిత వైఫై నెట్‌వర్క్‌లలో లావాదేవీలు చేయడం డేటా దొంగతనానికి దారి తీస్తుంది. సైబర్ నేరస్థులు నకిలీ ఇమెయిల్స్, లింకులు, వెబ్సైట్ల ద్వారా వినియోగదారులను మోసం చేస్తారు. ఒకసారి కార్డ్ నంబర్, CVV లేదా పాస్వర్డ్ వారి చేతికి చేరితే, ఖాతా నుంచి డబ్బు తెలియకుండానే విత్‌డ్రా అవుతుంది.
మాల్వేర్, స్పైవేర్ వంటి హానికరమైన సాఫ్ట్వేర్లు కూడా కార్డ్ డేటా చోరీకి కారణమవుతున్నాయి. చాలామంది తమ బ్యాలెన్స్ తగ్గిన తర్వాతే మోసం జరిగినట్లు గుర్తిస్తారు.
ఈ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు లావాదేవీ అలర్ట్‌లను తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. నెలవారీ స్టేట్మెంట్లను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.
కార్డ్ పిన్, పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోకూడదు. తరచూ వాటిని మార్చడం మంచిది. పబ్లిక్ కంప్యూటర్లు లేదా ఉచిత వైఫైలో కార్డ్ వివరాలు నమోదు చేయకుండా ఉండాలి. మీ కార్డును ఎప్పుడూ మీ సమక్షంలోనే స్వైప్ చేయించడం ద్వారా దుర్వినియోగాన్ని చాలా వరకు నివారించవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!