

తమిళనాడులో నటుడు, టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ నాయకుడు కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాలకు కొత్త ఊపిరినిచ్చిందని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వానికి స్పష్టమైన దార్శనికత కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఓటర్లు కోరుకుంటున్న మార్పును అంగీకరించేందుకు సంప్రదాయ ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా లేవని ఆరోపించారు. ఇండియా టుడే రౌండ్‌టేబుల్–తమిళనాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నటి త్రిషపై డీఎంకే నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అన్నామలై పరోక్షంగా తప్పుబట్టారు. మహిళలను, తల్లులను రాజకీయాల్లోకి లాగడం, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి పాత రాజకీయ పద్ధతులకు కొందరు నాయకులు ఇంకా కట్టుబడి ఉన్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పును రాజకీయ వారసులు అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారిని ‘భాజపా బీ టీమ్’గా ముద్ర వేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల భాజపాను వీడిన అన్నామలై త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!