

విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026'ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, విదేశీ కంపెనీలు, మదుపరులకు పన్ను రాయితీలు, సులభమైన నిబంధనలు, స్థిరమైన విధానాలతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ బిల్లులో భాగంగా భారత్ నుంచే కార్యకలాపాలు నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్లకు గిఫ్ట్ సిటీలో లభించే పన్ను ప్రయోజనాలను విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే భారత డేటా సెంటర్లను ఉపయోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు పన్ను మినహాయింపులు, రీట్స్ (REITs), ఇన్విట్స్ (InvITs) మదుపరులకు డివిడెండ్‌పై కొనసాగింపు పన్ను రాయితీలు ఇవ్వనున్నారు. దీని ద్వారా దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు వంటి కీలక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే విదేశీ కంపెనీలకు 2040-41 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. మరోవైపు, వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు పైబడిన వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ (MDR) వసూలు చేసేందుకు అవకాశం కల్పించాలని బిల్లులో సూచించారు. ఈ భారం వినియోగదారులపై పడితే యూపీఐ చెల్లింపుల వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!