ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు మాజీ ఉద్యోగి ఈ కుంభకోణానికి సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. బ్యాంకింగ్ ప్రక్రియను తారుమారు చేసి ప్రభుత్వానికి చెందిన నిధులను షెల్ కంపెనీల ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మాస్టర్‌మైండ్ సహా అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిభవ్ రిషి, అభయ్ కుమార్, అభిషేక్ సింగ్లా, స్వాతి సింగ్లాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో పనిచేసినవారు కాగా, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు. మాజీ మేనేజర్ రిభవ్ రిషియే ఈ కుట్రకు ప్రధాన కారణమని, ప్రస్తుతం ఆయన చండీగఢ్‌లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
హరియాణా ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన–2.0 పథకానికి సంబంధించిన నిధులను జమ చేసేందుకు 2025 సెప్టెంబర్ 26న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మరియు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో రెండు ఖాతాలు తెరవబడ్డాయి. తొలుత ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ.50 కోట్లు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.25 కోట్లు జమ చేశారు. తరువాత ఈ నిధులను వినియోగించేందుకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఖాతాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 13న వడ్డీతో సహా మొత్తాన్ని మరో ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలని బ్యాంకులకు లేఖలు పంపగా, జనవరి 16న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ.25.45 కోట్లు బదిలీ చేసి ఖాతా మూసేసింది. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కేవలం రూ.1.27 కోట్లు మాత్రమే బదిలీ చేయడంతో మిగిలిన రూ.50 కోట్లపై అనుమానాలు తలెత్తాయి.
విచారణలో ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నిధులను షెల్ కంపెనీల ఖాతాలకు మళ్లించినట్లు బయటపడింది. అంతేకాకుండా బ్యాంకులో నిర్వహణపరమైన లోపాలు, తప్పుల తడకగా జరిగిన లావాదేవీలు కూడా గుర్తించబడ్డాయి. దర్యాప్తులో మొత్తం రూ.590 కోట్ల ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు తేలగా, ఇప్పటికే ఆ మొత్తం సొమ్మును రికవరీ చేసినట్లు హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాలను నిర్వహించకుండా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మరియు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.




















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!