

బ్యాంక్ ఆఫ్ బరోడా పై భారీ డేటా లీక్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘ట్రిపుల్ ఎక్స్’ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. వారి ప్రకారం సుమారు ఒక టెరాబైట్ వరకు సున్నితమైన బ్యాంకింగ్ సమాచారం డార్క్ వెబ్‌లో బయటపడినట్లు చెబుతున్నారు. ర్యాన్సమ్‌వేర్ లైవ్ అనే పర్యవేక్షణ వేదిక సమాచారం ప్రకారం ఒకటి నుంచి మూడు లక్షల మంది వినియోగదారుల దరఖాస్తులు, ఫోటోలు, గుర్తింపు పత్రాలు, ఆధార్ వివరాలు, సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాల సమాచారం, రుణ రికార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగదారుల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. అదనంగా ఎన్నారై, కార్పొరేట్ బ్యాంకింగ్ పత్రాలు, కొన్ని అంతర్గత రహస్య పత్రాలు కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఘటనను నిపుణులు ‘సైబర్ విపత్తు’గా అభివర్ణిస్తున్నారు. శాఖల ఆడిట్ నివేదికలు, రుణ సిఫారసు పత్రాలు, నిఘా దర్యాప్తు రికార్డులు కూడా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బ్యాంక్ మాత్రం తమ ఉద్యోగి ఈమెయిల్ ఖాతా మాత్రమే హ్యాక్‌కు గురైందని, ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని తెలిపింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో బలమైన సమాచార సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయని, ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం ఇప్పటివరకు ఈ లీక్‌ను ధృవీకరించలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!