

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక రంగంలో వేగంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్పులకు దారి తీస్తోంది. ఉద్యోగాలపై దీని ప్రభావం గురించి ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ సేవలు, బీపీఓ రంగాలు గణనీయంగా తగ్గిపోవచ్చని ఆయన అంచనా వేశారు. అలాగే రాబోయే 15 ఏళ్లలో అనేక నైపుణ్య ఆధారిత వృత్తులు కూడా ఏఐ ప్రభావంతో కనుమరుగయ్యే అవకాశముందని హెచ్చరించారు.
భారత్‌లో జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’ నేపథ్యంలో ఓ జాతీయ సంస్థతో మాట్లాడిన ఖోస్లా, ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగాల నిర్మాణం పూర్తిగా మారిపోతుందని అన్నారు. రోబోలను వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశముందని తెలిపారు.
రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో అనేక సేవలు ఉచితంగా అందుబాటులోకి రావచ్చని, ముఖ్యంగా విద్య, వైద్యం అందరికీ చేరువ కావచ్చని ఆయన విశ్లేషించారు. భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనపై మాత్రమే దృష్టి పెట్టడం సరైన దారి కాకపోవచ్చని, ఎందుకంటే అనేక పనులను ఏఐ మరింత సమర్థంగా చేయగలదని చెప్పారు. భవిష్యత్తు కాలం ఏఐ–మనుషుల సహకారంతో ముందుకు సాగే దశగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారత్ ఇకపై కేవలం ఐటీ సేవల దేశంగా కాకుండా, ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ఖోస్లా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 16 నుంచి 20 తేదీల వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ సమిట్’ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలు తమ ఏఐ వ్యూహాలను వెల్లడించనున్నాయి. భారత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడం, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం ఈ సమిట్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వినోద్ ఖోస్లా తన అభిప్రాయాలను వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!