

టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుమారు 52 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థలో దాదాపు 7 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం అమలైతే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,600 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడవచ్చని తెలుస్తోంది. అయితే లేఆఫ్స్‌పై కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు, ప్రభావితమయ్యే ఉద్యోగులకు అందించే పరిహార ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మూడు నెలల జీతంతో పాటు సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక నెల జీతం చెల్లించే ప్రతిపాదన ఉన్నట్లు ఉద్యోగుల చర్చల్లో వెల్లడైంది. రెండు మూడు రోజుల్లో సెపరేషన్ పత్రాలపై సంతకాలు చేసి సమర్పిస్తే మరో నెల జీతం అదనంగా ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. వ్యక్తిగత పనితీరు కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగానే ఈ తొలగింపులు చేపడుతున్నట్లు ఓ ఉద్యోగి రెడ్డిట్‌లో పేర్కొన్నారని కథనంలో ఉంది. ఏఐ పెట్టుబడులు, ఖర్చుల తగ్గింపు కూడా ఈ నిర్ణయానికి కారణాలు కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ గత నెలలో ఉద్యోగులకు పంపిన మెమోలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఇదే సమయంలో డేటా సెంటర్లు, ఏఐ, కనెక్టెడ్ డివైజెస్ వంటి రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. Layoffs.fyi ట్రాకర్ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 350కి పైగా టెక్ కంపెనీల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించబడ్డాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!