

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలైన పెప్సీకో, క్వాల్‌కామ్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. శీతలపానీయాలు, స్నాక్స్ తయారీలో పేరొందిన పెప్సీకో ఉత్తర అమెరికాలో తన వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు సుమారు 1,000 ఉద్యోగాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యాపార వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ త్రైమాసికంలో ఐరోపా, మధ్య ఆఫ్రికా వ్యాపారంలో 5.41 బిలియన్ డాలర్ల వృద్ధి నమోదైనట్లు సమాచారం.
2025లో ఇలియట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ పెప్సీకోలో వాటాలు కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ చర్యలు వేగవంతమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, అక్టోబర్‌లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించిన క్వాల్‌కామ్ తాజాగా ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సంస్థ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణకు అంగీకరించే ఉద్యోగుల కోసం ప్రత్యేక ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి అంగీకరించి, అవసరమైన ఎగ్జిట్ పత్రాలపై సంతకాలు చేసిన వారికి అదనపు పరిహారం అందించనుంది.
క్వాల్‌కామ్ ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం అర్హులైన ఉద్యోగులకు రెండు వారాల స్థూల వేతనంతో పాటు, మిగిలిన సర్వీసులో ప్రతి ఏడాదికి రెండు వారాల అదనపు వేతనం చెల్లించనున్నారు. అలాగే, మిగిలిన సర్వీసు కాలానికి ముందుగానే లెక్కించిన పరిహారం, ఆరోగ్య బీమా కవరేజీ కోసం ఏకమొత్తంలో చెల్లింపు కూడా ఇందులో ఉన్నాయి. తాజా లేఆఫ్‌ల వల్ల ఎన్ని ఉద్యోగాలు ప్రభావితమవుతాయనే విషయాన్ని సంస్థ కచ్చితంగా వెల్లడించలేదు. తొలుత భారత్‌లో సుమారు 1,000 ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చని అంచనా వేసినా, ప్రస్తుతం ఆ సంఖ్య తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. క్వాల్‌కామ్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 52,000 మంది ఉద్యోగులు ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!