

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందింది. ఈ ఘనత సాధించిన GHMC అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాల పనితీరును పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. ఈ ప్రమాణాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతికి గుర్తింపుగా ఈ జాతీయ పురస్కారం లభించింది. ఇది నగరానికి, రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి, ఈ గుర్తింపు సాధించడంలో GHMC అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషి కీలకమని ప్రశంసించారు. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా, నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, పచ్చదనాన్ని విస్తరించడం ద్వారా పరిశుభ్రమైన, పర్యావరణహితమైన, సుస్థిర నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ పురస్కారం మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!