

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. Y43 కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్లకు పోటీగా నిలవనుంది. 2021 అక్టోబర్‌లో విడుదలైన టాటా పంచ్ ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి 2027 నాటికి తన కొత్త మైక్రో ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026 ప్రారంభంలో ఉత్పత్తి నిలిచిపోయిన ఇగ్నిస్ స్థానాన్ని ఈ కొత్త మోడల్ భర్తీ చేసే అవకాశం ఉంది.
జపనీస్ కీ-కార్ డిజైన్ శైలిలో రూపొందుతున్న ఈ వాహనం బాక్సీ లుక్, ఫ్లాట్ బోనెట్‌తో ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇందులో 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 16 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉండనున్నట్లు సమాచారం. క్యాబిన్లో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, హై-పవర్ టైప్-సీ యూఎస్బీ పోర్టులు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను అందించనున్నట్లు తెలుస్తోంది. 1.2 లీటర్ Z12E మూడు సిలిండర్ల ఇంజిన్‌తో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లు రానున్నట్లు సమాచారం. ఐదు స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లు కూడా అందుబాటులో ఉండవచ్చని అంచనా. భవిష్యత్తులో సిరీస్-హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావడంపైనా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ధర, తుది ఫీచర్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!