

మాదాపూర్ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో సుందరీకరించి పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తాను తప్పుగా అర్థం చేసుకున్నానని, అయితే చెరువుల పరిరక్షణతో పాటు నగర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న తర్వాత తన అభిప్రాయం మారిందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. చెరువుల పరిరక్షణకు తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం ఇక్కడ డ్యాన్సులు చేయకపోయినా భవిష్యత్తులో తన సినిమాల షూటింగ్‌లను ఇక్కడ నిర్వహిస్తానని సరదాగా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని ప్రశంసించిన నాగార్జున, త్వరలో చేపట్టనున్న మూసీ పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత జరిగే ప్రారంభోత్సవానికి తనను కూడా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు చూశానని, అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలిసారి కలిసినప్పుడు కొంత అసంతృప్తితో, మరో ఆలోచనతో వెళ్లానని, అయితే హైడ్రా లక్ష్యాలను ఆయన వివరించిన తర్వాత నగరం, పర్యావరణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ప్రాధాన్యత తనకు అర్థమైందని నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్‌లో దాదాపు 2,000 చెరువులను ఇదే తరహాలో పునరుద్ధరిస్తే భవిష్యత్తులో నీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని, సుమారు 42 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తమ్మిడికుంట పునరుద్ధరణ తర్వాత ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం నాలుగు మీటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు శిల్పారామం సమీపంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ, వర్షపు నీరు ఈ ప్రాంతంలోకి చేరి ముంపు, ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యేదని చెప్పారు. చెరువుల పునరుద్ధరణతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, క్లౌడ్‌బరస్ట్‌ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. వచ్చే తరాలకు మనం అందించాల్సిన నిజమైన సంపద డబ్బు కాదని, స్వచ్ఛమైన ప్రకృతి అని, ప్రకృతి బాగుంటేనే మనుషులు సంతోషంగా ఉండగలరని నాగార్జున పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!