

భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాలకు ప్రారంభ స్థాయిలోనే గరిష్టంగా రూ.21 లక్షల వార్షిక వేతనం ప్రకటించి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీల్లో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం, అధిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం త్వరలో ఆఫ్ క్యాంపస్ ఎంపికలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు రూ.7 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు వార్షిక వేతనం ఇవ్వనున్నారు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (ఎల్1–ఎల్3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రెయినీ) వంటి హోదాలు ఇందులో ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎమ్ఈ, ఎంటెక్, ఎమ్సీఏ, ఇంటిగ్రేటెడ్ ఎమ్ఎస్సీ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు అర్హులు.
వేతన వివరాల ప్రకారం, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 ట్రెయినీకి రూ.21 లక్షలు, ఎల్2కి రూ.16 లక్షలు, ఎల్1కి రూ.11 లక్షలు అందనుండగా, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ ట్రెయినీకి రూ.7 లక్షలు ఇవ్వనున్నారు. గత పదేళ్లుగా ఫ్రెషర్ల వేతనాలు పెద్దగా పెరగని పరిస్థితుల్లో ఈ ప్రకటన ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!