టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రముఖ నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌లో భారీ మార్పులు చేసింది. గత దశాబ్ద కాలంలోనే అతిపెద్ద అప్డేట్గా పేర్కొంటూ, జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ‘ఆస్క్ మ్యాప్స్’ అనే కొత్త ఫీచర్‌తో పాటు ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ అనే విజువల్ అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్లను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ అప్డేట్ల ద్వారా యూజర్లకు నావిగేషన్ అనుభవాన్ని మరింత సులభంగా, వేగంగా మార్చడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.
కొత్తగా తీసుకొచ్చిన ‘ఆస్క్ మ్యాప్స్’ ఫీచర్ వ్యక్తిగత సహాయకుడిలా పనిచేస్తుంది. యూజర్లు మ్యాప్స్‌లోనే నేరుగా ప్రశ్నలు అడిగి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు “దగ్గరలో రద్దీ లేని పబ్లిక్ బాత్రూం ఎక్కడ ఉంది?” లేదా “ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం దగ్గరలో ఎక్కడ ఉంది?” వంటి ప్రశ్నలకు కూడా జెమిని ఏఐ ఆధారంగా వెంటనే సమాధానాలు లభిస్తాయి. యూజర్లు ‘ఆస్క్ మ్యాప్స్’ బటన్‌పై ట్యాప్ చేసి తమ ప్రశ్నలను అడగవచ్చు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు సంబంధిత మ్యాప్‌ను కూడా యాప్ చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను భారత్, అమెరికా దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే ఇది డెస్క్‌టాప్ వెర్షన్లో కూడా అందుబాటులోకి రానుంది.
ఇంకా ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ అనే కొత్త విజువల్ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ అనుభవాన్ని మరింత వాస్తవికంగా మార్చింది. ఈ ఫీచర్లో 3D భవనాలు, స్పష్టంగా కనిపించే రోడ్లు, పచ్చదనం, మెరుగైన రంగులు వంటి అంశాలతో నావిగేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైవింగ్ సమయంలో వచ్చే గందరగోళాన్ని తగ్గించి, యూజర్లకు కచ్చితమైన దారిని చూపించడం దీని ప్రధాన లక్ష్యమని గూగుల్ తెలిపింది. ఈ అప్డేట్ తొలుత అమెరికాలో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో ఇతర దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లు, అలాగే కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ బిల్ట్-ఇన్ ఉన్న కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!