

నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ అంతరిక్ష చరిత్రలో కొత్త రికార్డు సృష్టించబోతోంది. నలుగురు వ్యోమగాములతో ప్రయాణిస్తున్న ఒరాయన్ వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 6 సాయంత్రం 7.07 గంటలకు వ్యోమనౌక భూమి నుంచి గరిష్ఠంగా 252,757 మైళ్ల దూరానికి చేరుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఇది రేపు తెల్లవారుజామున సుమారు 4.35 గంటలకు జరుగుతుంది. దీంతో ఇది భూమి నుంచి అత్యధిక దూరానికి చేరిన మానవ యాత్రగా నిలవనుంది. 1970 లో జరిగిన అపోలో 13 మిషన్ కంటే సుమారు 4,102 మైళ్ల ఎక్కువ దూరం ఇది చేరుకోనుంది.
ఈ మిషన్‌లో రీడ్ వైస్మెన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనా కోచ్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ పాల్గొంటున్నారు. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ, భూమి నుంచి కనిపించని ఫార్ సైడ్ ప్రాంతాన్ని కూడా ఫోటోలు తీయనున్నారు.
చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 4 వేల మైళ్ల ఎత్తులో ఫ్లైబై పూర్తి చేసిన తర్వాత వ్యోమనౌక భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. మిషన్ పూర్తయ్యాక ఏప్రిల్ 10 న (అమెరికా కాలమానం ప్రకారం) వ్యోమగాములు భూమికి చేరుకోనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!