

కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. దాని భవిష్యత్తు పరిణామాలపై టెక్ రంగంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. గూగుల్ డీప్‌మైండ్‌లో ఏఐ సేఫ్టీ, అలైన్‌మెంట్ పరిశోధనల్లో పనిచేసిన మాజీ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ తాజాగా సంచలన హెచ్చరిక చేశారు. అధునాతన ఏఐ మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారకముందే భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గూగుల్‌లో ఏఐ అభివృద్ధిని ప్రత్యక్షంగా గమనించిన తనకు.. ప్రస్తుతం దాని వేగం ఆందోళన కలిగిస్తోందని చెబుతూ ఆయన సంస్థకు రాజీనామా చేశారు. ఈ ఆందోళనలు ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని సూచిస్తున్న ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ వంటి టెక్ నేతల అభిప్రాయాలతోనూ అనుసంధానమవుతున్నాయి.
ఇదే సమయంలో గూగుల్ డీప్‌మైండ్ ఏజీఐ సేఫ్టీ బృందంలో పనిచేసిన జాష్ ఎంగెల్స్ కూడా తన పదవి నుంచి వైదొలిగి స్వతంత్ర ఏఐ మూల్యాంకన సంస్థ METRలో చేరారు. అధునాతన ఏఐ వ్యవస్థల సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా చర్యలు అభివృద్ధి చెందకపోతే.. వచ్చే ఐదేళ్లలోనే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఏఐ వ్యవస్థలు పరస్పరం సహకరించడం, అనధికారికంగా కంప్యూటర్ వ్యవస్థల్లోకి ప్రవేశించడం, తమ చర్యలను దాచడం వంటి ఘటనలు ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఏఐ ప్రమాదాలను స్వతంత్రంగా అంచనా వేసే సంస్థలు మరిన్ని అవసరమని, ఈ రంగంలోని కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఎంగెల్స్ సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!