

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3 టోర్నీలో భారత పారా ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో తోమన్ కుమార్-శ్యామ్ సుందర్ స్వామిల జోడీ 152-139తో ఇరాక్కు చెందిన అబ్బాస్-అన్వర్ జంటను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో హర్వీందర్ సింగ్-విజయ్ జోడీ 6-2తో స్లొవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్-డెన్నిస్ ఇవాన్లపై విజయం సాధించి మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.
మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో భావన-పూజలతో కూడిన భారత జట్టు 0-6తో చైనా జోడీ లియాంగ్-చెన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. డబ్ల్యూ-1 మిక్స్డ్ టీమ్ ఫైనల్లో స్వాతి-అదిల్ మహ్మద్ జంట 1-5తో చెకియా జోడీ ముసిలోవా-డేవిడ్ చేతిలో పరాజయం పాలై రజతం సాధించింది. డబ్ల్యూ-1 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వాతి 6-2తో రష్యాకు చెందిన క్రటోవాపై గెలిచి కాంస్య పతకం దక్కించుకుంది. మరోవైపు మహిళల కాంపౌండ్ టీమ్ కాంస్య పోరులో శీతల్ దేవి-పాయల్ నాగ్ జంట 140-149తో చైనా జోడీ వాంగ్-గావో చేతిలో ఓడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!