

‘బేబి’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. తాజాగా ఆనంద్ దేవరకొండతో కలిసి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన వైష్ణవి.. ‘బేబి’తో పోల్చితే ‘ఎపిక్’ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ‘బేబి’ తర్వాత మళ్లీ ఆనంద్ దేవరకొండతో కలిసి పనిచేస్తున్నందున తమ ఎంపిక సరైందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని భావించామని తెలిపారు. ‘బేబి’ తర్వాత ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనే విషయంలో తొలినాళ్లలో కొంత భయం, ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు.
‘ఎపిక్’లో తాను పోషించిన కడలి పాత్ర తనకు ఎంతో దగ్గరైందని వైష్ణవి తెలిపారు. కడలిలా స్వేచ్ఛగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నా.. పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రభావం కారణంగా చాలామంది తమ కోరికలను మనసులోనే దాచుకుంటారని వివరించారు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ తమ కోసం తాము గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంటుందని, అందుకే ఈ పాత్రతో బాగా కనెక్ట్ అయ్యానని చెప్పారు. సినిమా చేస్తున్న సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, గతంలో బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఉండే సంకోచం తగ్గిందని తెలిపారు. కడలి పాత్ర తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలనే విషయాన్ని ఈ సినిమా ద్వారా నేర్చుకున్నానని వైష్ణవి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!