

గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్, ఇండియా ‘ఏ’ జట్ల ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేకంగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. గత నెల ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమగ్ర సమీక్ష సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ పరిస్థితులపై పూర్తి సమాచారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద ఉంటుందని, సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య ఎలాంటి సమాచార లోపాలు లేకుండా ఉండేందుకు లక్ష్మణ్ ఇకపై అన్ని సెలక్షన్ సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు.
గతంలో కొందరు ఆటగాళ్ల పేర్లను జట్టులో ప్రకటించిన తర్వాత వారు నిర్ణీత సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో చివరి నిమిషంలో పర్యటనల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయని సైకియా తెలిపారు. ఇలాంటి సమస్యలను శాశ్వతంగా నివారించడమే కొత్త విధానం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇది కేవలం పారదర్శకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సెలెక్టర్లకు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!