
.webp&w=3840&q=75)
దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 77 పరుగులు చేసి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో శతకం సాధించిన విరాట్, అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కోహ్లి తనదైన ఆన్డ్రైవ్లు, కట్ షాట్లతో స్కోరు ముందుకు నడిపించాడు. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో స్పిన్నర్ బంతిని తప్పుగా అంచనా వేసి స్టంపౌట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధసెంచరీతో నిలదొక్కుకోవడంతో ఢిల్లీ పోరాడే స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ చివర్లో తడబడి 247 పరుగులకే ఆలౌటై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇదే టోర్నీలో తొలి మ్యాచ్‌లో శతకం చేసిన రోహిత్ శర్మ, ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా ముంబయి బ్యాటర్లు భారీగా పరుగులు సాధించడంతో ఆ జట్టు 331 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంలో ఉత్తరాఖండ్ పోరాడినా లక్ష్యాన్ని అందుకోలేక ఓటమి చవిచూసింది.
మరో మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆర్యన్ జుయల్, రింకు సింగ్ శతకాలతో యూపీ 367 పరుగులు చేయగా, ఛేదనలో చండీగఢ్ 140 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక-కేరళ మ్యాచ్‌లో కరుణ్ నాయర్, దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీలతో కర్ణాటక సులువైన విజయాన్ని అందుకుంది.
హైదరాబాద్‌కు టోర్నీలో రెండో ఓటమి ఎదురైంది. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడింది. మరోవైపు ఆంధ్ర జట్టు హేమంత్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రైల్వేస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!